ఎప్పుడో చదివిన జ్ఞాపకం: “పసిడి దాచెను పిసినారి ముసలి యొకడు”

1.ఊరి వెలుపల పాడు కోనేరు చెంత
మనుజులెవ్వరు మసలని మారుమూల
గుట్ట చాటున లోతైన గోయి త్రవ్వి
పసిడి దాచెను పిసినారి ముసలి యొకడు.
.
2. ప్రతిదినంబున వృద్ధుండు పాతుత్రవ్వి
మురిసి పడుచుండు బంగారు ముద్దజూచి
పొదలమాటున నదియెల్ల పొంచిచూచి
దొంగ యొక్కడు సర్వంబు దోచికొనియె
.
౩. మరుదినంబున ముసలివాడరుగుదెంచి
గోయిత్రవ్వంగ బంగారు మాయమయ్యె
నెత్తినోరును లబలబ మొత్తికొనుచు
గొల్లుమని యేడ్చి యతడు గగ్గోలువెట్టె
.
4. అంతనాతని యరపుల నాలకించి
పరుగు పరుగున పొరుగువారరుగుదెంచి
“ఏల యేడ్చెద వీలీల నేల బొరలి?”
అనుచు ప్రశ్నింప నీరీతి బనవె నతడు
.
5. “ఏమి చెప్పుదు? ముప్పదియేండ్ల నుండి
కూడబెట్టిన ధనమెల్ల గోతిలోన
దాచియుంచితి, నెవ్వడో తస్కరుండు
పచ్చపైకంబు మునుముట్ట మ్రుచ్చిలించె
.
6. “అనుదినంబును నిచ్చటి కరుగుదెంచి
కాంచనంబును కాంక్షమై కాంచుచుందు;
ఏమి చేయుదు నక్కటా! యింకమీద?”
అంచు ముదుసలి కన్నీరు నించి చెప్పె
.
7. అనుడు నా మాటలకు వార లనిరి యిట్లు
“పరులకీయవు, కుడువవు, పైడి నీకు
ఏమి లాభంబు చేకూర్చె నింతదనుక?
అకట! ఉండిన నూడిన నొకటి కాదె
.
8. ఇప్పుడైనను మించినదేమి కలదు?
పైడి గలచోట నొకపెద్ద బండ పాతి
కాంచు చుండుము నిత్యంబు కాంక్ష దీర”
అనుచు ముదుసలి వగ్గుతో ననిరి వారు.

1980 లలో తెలుగు వాచకంలో పద్యంగా వచ్చిన ఈ కవిత మధురకవిగా పేరు గాంచిన నాళం కృష్ణా రావు గారు వ్రాసారు

Sharing is caring!