ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి, కృష్ణా జిల్లా టాప్

అమరావతి: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో (AP Inter Results) మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు ద్వితీయ స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో సంవత్సరం ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.

రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Sharing is caring!